Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 11:47:18
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- గ్రామ బాటే.. అభివృద్ధికి రాచబాట అంటూ ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. దీంతో పాటు మరికొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం పేరుతో పల్లెకు పోదాం ఛలో ఛలో అంటోంది ఏపీ ప్రభుత్వం. 2 రాత్రులు, 3 పగళ్లు IASలు ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.. ప్రజాప్రతినిధులతోపాటు.. ముఖ్యకార్యదర్శులు కూడా పల్లెనిద్రలో పాల్గొని.. పలు సమస్యలు పరిష్కరించడం, అలాగే అభివృద్ధికి రూట్ మ్యాప్ తదితర అంశాలపై చర్చించనున్నారు.
రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ
త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. గతంలో ఈ ఫీజు 65లక్షలు ఉంటే.. ఇప్పుడు 25 లక్షలకు తగ్గించింది. 710కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. నాగార్జునసాగర్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్రం సహకారంతో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించబోతోంది ఏపీ ప్రభుత్వం.
నోడల్ ఏజెన్సీగా డ్రోన్ కార్పొరేషన్..
ఇప్పటివరకూ స్టేట్ ఫైబర్‌నెట్‌లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.