Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 10:55:34
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులతో పాటు ఆ భూమిలో చెట్ల సంరక్షణ మినహా అన్నిరకాల కార్యకలాపాలను తక్షణం నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతకు అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అంటూ నిలదీసింది. అటవీ, పర్యావరణ అంశాలకు సంబంధించిన గోదావర్మన్ తిరుమల్పాడ్ కేసులో కోర్టు సహాయకుడి (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న చెట్ల నరికివేత పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ గవాయి స్పందించి.. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3.30 గంటలలోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు సమయంలో హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం పై విధంగా ఆదేశించారు. \"హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదిక, ఫొటోలు అక్కడున్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దాదాపు 100 ఎకరాలను ధ్వంసం చేయడానికి పెద్దసంఖ్యలో భారీ యంత్రాలను మోహరించారు. ఆ ప్రాంతంలో కొన్ని నెమళ్లు, జింకలు, పక్షులు కనిపించినట్లు నివేదికలో ఉంది. అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీప్రాంతం ఉందనడానికి ఇది ప్రాథమిక ఆధారం. దట్టమైన అటవీప్రాంతంలో చెరువు, దాని పక్కన జింకలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అందుకే మేం ఇది సుమోటోగా స్వీకరించడానికి తగిన కేసు అని భావించి ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చాం. ఈ కేసులోని అన్ని కోణాలతో రిట్ పిటిషన్ తయారు చేయమని అమికస్ క్యూరీకి విజ్ఞప్తి చేశాం.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలి” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిజిస్ట్రార్ తన నివేదికతోపాటు జతపరిచిన ఫొటోలను చూపుతూ “ఇది చాలా తీవ్రమైన విషయం. మేం అన్ని కార్యకలాపాలపై స్టే విధిస్తున్నాం. ఆ స్థలంలో తదుపరి చెట్లు కొట్టేయడం కానీ, ఇతరత్రా పనులు కానీ చేపట్టకూడదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు” అని జస్టిస్ గవాయి ఆదేశించారు. ఈ ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయకపోతే అందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ.. \"ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 400 ఎకరాల భూమిని ఎన్నడూ అటవీప్రాంతంగా ప్రకటించలేదు\" అన్నారు. అందుకు జస్టిస్ గవాయి స్పందిస్తూ.. \"అటవీ ప్రాంతమా? కాదా? అన్నది మరిచిపొండి.. చెట్లు కొట్టడానికి అనుమతులు తీసుకున్నారా?\" అని అడిగారు. అక్కడ చెరువు ఉందంటే అది నీటిప్రవాహ ప్రాంతం అయి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎంత పెద్దవారైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. దీనికి గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలనూ సంపూర్ణంగా సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాము దాఖలు చేసే అఫిడవిట్లో అన్ని విషయాలూ వివరిస్తామని పేర్కొన్నారు.