Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 11:10:04
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కంచ గచ్చిబౌలి భూమిలో చేపట్టిన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి ప్రకటించారు. \"కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీసంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. ఒక చెట్టును నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్దమొత్తంలో చెట్లను తొలగించేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. జీవవైవిధ్యం కళ్లముందు కనబడుతున్నప్పటికీ చెట్ల నరికివేత కొనసాగించడంపై విస్మయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఈ అటవీసంపద విధ్వంసాన్ని గురువారం ఉదయమే సుమోటోగా తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా చెట్ల నరికివేతను కొనసాగించడం దురదృష్టకరం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఆందోళన చేపట్టగా.. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలి” అని కిషన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మరోవైపు భాజపా ఎంపీ రఘునందన్రావు విలేకర్లతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇదంతా విద్యార్థులు సాధించిన విజయమేనని పేర్కొన్నారు.