Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-04 10:51:22
తెలుగు వెబ్ మీడియా న్యూస్:భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో.. తెలంగాణలోనే అతిపెద్ద ఎకోపార్ను ఏర్పాటుచేస్తామని, ఇది తమ అధినేత కేసీఆర్ నిర్ణయమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆ పార్ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులకు, గ్రేటర్ హైదరాబాద్లో తమను ఏకపక్షంగా గెలిపించిన నగర ప్రజలకు బహుమతిగా అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు విని ఎవరైనా ఆ భూములను కొనుగోలుచేస్తే.. తమ ప్రభుత్వం రాగానే వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటుందని, ఇప్పుడు భూములు కొనాలనుకునేవారు ముందే ఆలోచించుకోవాలని.. తర్వాత తమను అనొద్దని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “రేవంత్రెడ్డి ప్రభుత్వం రియల్ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేం మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాం. దిల్లీలో మాదిరిగా మాస్కులు పెట్టుకోవాల్సిన దుస్థితి హైదరాబాద్లో రావద్దనే దూరదృష్టితో ఈ 400 ఎకరాల్లో పచ్చదనాన్ని పరిరక్షించాలనేది మా నిర్ణయం. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే.. హైదరాబాద్ ప్రజలతోపాటు పెద్దఎత్తున మా పార్టీ కార్యకర్తలం, ప్రజాప్రతినిధులందరం హెచ్సీయూకి తరలివెళ్తాం. ఈ పోరాటంలో కలిసివచ్చే పర్యావరణవేత్తలకు అండగా ఉంటాం. పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే.. కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి అణువంతైనా లేదు. ప్రజల సొమ్ముకు ముఖ్యమంత్రి ధర్మకర్త మాత్రమే. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని.. సీఎం మానవతాదృక్పథంతో ఆలోచించాలి. హెచ్సీయూలో చదువుకుంటున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకున్నంత ప్రేమలో సీఎం రేవంత్రెడ్డికి ఇసుమంతైనా ఉందా? ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్యూచర్సిటీలో 14 వేల ఎకరాలు అందుబాటులో ఉండగా.. హెచ్సీయూలోని 400 ఎకరాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 270 కోట్ల మొక్కలను నాటి హరితవిప్లవాన్ని సృష్టించాం. పర్యావరణ పరిరక్షణలో, పచ్చదనం పెంపులో దేశంలోనే తెలంగాణను నంబర్వన్ నిలిపాం. ఈ విషయాలపై భారత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను కేంద్ర మంత్రి బండి సంజయ్ చదువుకోవాలి. ఎస్ఆర్డీపీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కట్టడానికి మా ప్రభుత్వ హయాంలో పిలిచిన టెండర్లను ప్రజల నిరసనలతో రద్దుచేశాం. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామిక లక్షణం\" అని కేటీఆర్ పేర్కొన్నారు.