Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-03 10:22:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఇప్పటికే 4500కు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్ బాబు మరో ఇద్దరు చిన్నారులకు ఊపిరి పోశాడు. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేయించాడు. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఈ ట్యాగ్ మహేష్ బాబుకు సరిగ్గా సరిపోతుంది. ఓ వైపు సినిమాలతో తన అభిమానులను అలరిస్తోన్న మహేష్ మరోవైపు తన సేవా కార్యక్రమాలతోనూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా మహేష్ బాబు ఫౌండేషన్ ను స్థాపించి అవసరమైన వారికి ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ప్రాణదాతలా నిలుస్తున్నాడు మహేష్. వారికి ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నాడీ సూపర్ స్టార్. అలా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4500 లకు పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించినట్లు ఇటీవలే ఆంధ్రా హాస్పిటల్స్ అధికారికంగా వెల్లడించింది. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడాడీ స్టార్ హీరో.
తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం..
నాగుల్ మీరా అనే రెండేళ్ల అబ్బాయి అలాగే పంతం రఘువీర్ అనే నాలుగు నెలల చిన్నారి పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకున్న వీరి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంధ్రా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఈ ఇద్దరు పిల్లలకు విజయవంతంగా గుండె సర్జరీలు జరిగినట్లు మహేష్ బాబు ఫౌండేషన్ తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఇద్దరు చిన్నారులు వారి తల్లిదండ్రుల ఫొటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తమ పిల్లలకి పునర్జన్మ ఇచ్చారని ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు మహేష్ బాబు పై ప్రశంశలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులతో పాటు నెటిజన్లు సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దైవం మనుష్య రూపేణా అంటూ మహేష్ ను పొగిడేస్తున్నారు.