Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:22:10
తెలుగు వెబ్ మీడియా న్యూస్:సంధి కోసం కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విర్రవీగాడు. చివరకు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సయోధ్యలో భాగంగానే మేం హస్తినకు వచ్చి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతివ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశాం. చట్టాలను సవరించి.. 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. మా రిజర్వేషన్లు మేం సాధిస్తాం” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్మంతర్లో బుధవారం మహాధర్నా నిర్వహించాయి. దీనికి సీఎం హాజరై మాట్లాడారు. “బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి పంపినా.. అనుమతివ్వడానికి ప్రధానికొచ్చిన కష్టమేంది? బిల్లుకు అనుకూలమని జంతర్మంతర్ వేదికగా 16 పార్టీలు ప్రకటించాయి. తాను బీసీల కోసమే ఉన్నానని ప్రధాని మోదీ అంటున్నారు. బీసీల కోసం ప్రాణాలిస్తామని బండి సంజయ్ ప్రకటిస్తున్నారు. మేం మీ ప్రాణాలు కాదు.. 42% రిజర్వేషన్లు మాత్రమే కోరుతున్నాం. దీనికి అనుమతివ్వకపోతే.. దేశమంతా జాగృతం చేసి అన్ని సంఘాలను కూడగడతాం. నిప్పురవ్వలా రగిలి దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు దిల్లీ గద్దెపై ఎలా ఉంటారో చూస్తాం. మా డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి... లేదంటే గద్దె దిగైనా పోవాలి. 2015లో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ జంతర్మంతర్లో ధర్నా చేసి అలసిపోయి చెట్టు కింద కూర్చున్నప్పుడు \'మీది ధర్మమైన కోరిక కాబట్టి ధర్మయుద్ధం ప్రకటించాల\'ని నేను చెప్పడంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్షల మంది సమక్షంలో ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించి లక్ష్యం చేరుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పరేడ్ గ్రౌండ్లో పది లక్షల మందితో ధర్మయుద్ధం ప్రకటించి మన బలమేంటో చూపిద్దాం” అని రేవంత్రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ హామీ నెరవేర్చేందుకే కులగణన
\"కులగణనకు స్ఫూర్తి రాహుల్ గాంధీయే. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 150 రోజులు.. 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు తమ జనాభా లెక్కలు తేల్చాలని ఆయనను బీసీ సంఘాల ప్రతినిధులు అడిగారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జనగణనతోపాటు కులగణన కూడా చేయాలని.. దేశంలో ఎవరెంత మంది ఉన్నారో లెక్కతేల్చి దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తామని.. బీసీలకు ఉద్యోగావకాశాల్లోనే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ వాగ్దానం చేశారు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుతూ రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కులగణన పూర్తి చేసి.. దేశానికి దిక్సూచిగా నిలిచాం. దేశంలో ఇంత పకడ్బందీగా కులగణన చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణయే. భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదు. కులగణన లెక్కలను ఫిబ్రవరి 4న చట్టసభలో ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో బలహీనవర్గాలవారు 56.36 శాతం మంది ఉన్నట్లు లెక్క తేలింది. వారికి స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టే శాసనసభలో తీర్మానం చేసి పంపాం. మేం దీన్ని భాజపా పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో అమలు చేయాలని అడగడం లేదు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతివ్వాలని మాత్రమే అడుగుతున్నాం.