Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-03 10:17:26
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : భారత్ ఉత్పత్తులపై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని తెలిపారు. అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు.
అమెరికాకు ఈరోజు పునర్జన్మ: ట్రంప్
ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. తమ టాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది అని తెలిపారు.
పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి. అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.