Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-03 10:16:40
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఎర్త్ క్వేక్.. అంటే భూకంపం గురించి మనం విన్నాం. మొన్ననే మయన్మార్‌లో చూశాం. కానీ మెగా క్వేక్ గురించి విన్నారా? రాబోయే కాలంలో జపాన్‌లో చూడొచ్చంటున్నారు సైంటిస్టులు. సీస్మోగ్రాఫ్‌పై 7.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్ నేలమట్టమై పోయింది. పొరుగునే ఉన్న థాయ్‌లాండ్ కూడా కుదేలైపోయింది. ఇక అదే భూకంపం… 9 పాయింట్లు దాటి వస్తే దాన్నే మెగా క్వేక్ అంటారు. ఆ స్థాయి భూకంపం వస్తే, ఆ తర్వాత సునామీ కూడా విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఇదే మెగా క్వేక్ భయం జపాన్‌ను వెంటాడుతోంది. రాబోయే 30 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు కాళ్ల కింద భూమి బద్దలైపోతుంది.. నెత్తి మీద కప్పు కూలిపోతుందని, బతుకు చితికిపోతుందని తెలుసు. దానిని ఎలా ఎదుర్కోవాలా అనేదే జపాన్‌కు అతి పెద్ద సమస్యగా మారింది.
ఆ మెగా క్వేక్‌తో జపాన్‌లో 3 లక్షలమంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. 12లక్షలమందికి పైగా నిలువనీడ లేకుండా పోతారని చెబుతున్నారు. 2 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందట. అంటే మన కరెన్సీలో సుమారుగా 170 లక్షల కోట్ల రూపాయలు. ఇక చలికాలం పూట, రాత్రి వేళ భూమి బద్దలవుతుందని, ఆ తర్వాత సునామీ పడగ విప్పి విరుచుకుపడుతుందని అంచనాలు కడుతున్నారు. 2024లో దక్షిణ జపాన్‌లో వచ్చిన భూకంపం తర్వాత, ఈ మెగా క్వేక్ అంచనాలు వెలువడ్డాయి. నాంకై ట్రఫ్ కేంద్రంగా ఈ మెగా క్వేక్ వస్తుందని భావిస్తున్నారు. టోక్యో నుంచి క్యుషు ద్వీపం దాకా.. సముద్రం లోపల 900 కిలోమీటర్ల పొడవుండే గోతినే నాంకాయ్ ట్రఫ్ అంటారు. ఇక్కడే యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ కిందకు ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ చొచ్చుకు వెళుతోంది. దీంతో అవి ఒకదానినొకటి ఢీకొన్నప్పుడు, సీస్మోగ్రాఫ్‌పై 9 పాయింట్లను మించి మహా భూకంపం లేదా మెగా క్వేక్ పుడుతుంది. రాబోయే 30 ఏళ్లలో, ఏ క్షణంలోనైనా ఇది సంభవించవచ్చని సమాచారం. ఆ యూరేషియన్ ప్లేట్ మీదే జపాన్ ఉండడం..వాళ్లకు దినదినగండంగా మారింది.