Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:36:55
తెలుగు వెబ్ మీడియా న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్ నుంచి సీఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. "ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంతకాళ్లపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టాం. మండల పరిషత్, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలి. అభ్యర్థులు అక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమలశాఖ అవగాహన కల్పిస్తుందని మంత్రి శ్రీధరా బాబు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.