Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-12-21 10:15:35
తెలుగు వెబ్ మీడియా న్యూస్: టాలీవుడ్ సినీప్రియులకు పరిచయం అవసరంలేని నటుడు సోనూసూద్. ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. సోనూసూద్ కెరీర్లో అద్భుతమైన పాత్రలు అనేకం ఉన్నాయి. అందులో పశుపతి ఒకటి. ఈ పేరు చెప్పగానే “అమ్మ బొమ్మాళీ ” అనే డైలాగ్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అంతగా తన పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూసూద్ అరుంధతి సినిమాలోని తన పాత్ర పశుపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలాగే తన కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచిన జోధా అక్బర్ సినిమా చిత్రీకరణ విశేషాలను కూడా గుర్తుచేసుకున్నారు. అరుంధతి సినిమాలోని పశుపతి పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు.
‘నేను నా కెరియర్ లో బాగా కష్టపడిన పాత్ర అరుంధతి సినిమాలోని పశుపతి. ఆ రోల్ నాకు చాలా ప్రత్యేకం. మేకప్ కే ఆరేడు గంటలు పట్టేది. మేకప్ వల్ల దద్దుర్లు వచ్చాయి. పగలు, రాత్రి కంటిన్యూగా షూటింగ్ జరిగింది. చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాక డైరెక్టర్ నుంచి ఎప్పుడూ ఫోన్ కాల్ వచ్చినా మళ్లీ యాక్ట్ చేయమంటారేమోనని భయపడేవాడిని.. సినిమా విడుదల తర్వాత ముంబయి నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చాను. థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ చూసి ఆశ్చర్యపోయాను. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అప్పుడు అర్థమైంది. అదంతా జరిగి అప్పుడే 15 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే జోధా అక్బర్ మూవీ గురించి మాట్లాడుతూ.. “సినిమా ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. ఐశ్వర్యరాయ్ సడెన్ గా వచ్చి నిన్ను చూస్తుంటే మా పా (అమితాబ్ బచ్చన్) గుర్తొస్తున్నారని చెప్పింది. ఆమె బెస్ట్ కో స్టార్. బచ్చన్ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లతోనూ కలిసి నటించాను” అని అన్నారు. ప్రస్తుతం సోనూసూద్ ఫతేహ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.