Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-01-04 11:35:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఆ పార్టీకి మరో షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపద్యంలోనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్లు కూడా చేశారు. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై విచారణ మొదలుపెట్టారు. ఇక విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారా అనే భయం అటు అధికారుల్లోనూ ఇటు రాజకీయ నాయకుల్లో కూడా నెలకొంది. అయితే ఈ విచారంలో దాదాపుగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టు డిజైన్ విషయంలో అలాగే భూసేకరణ సహా పలు కీలక అంశాల్లో రాజకీయ నాయకుల సూచనల మేరకే తాము పని చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి అలాగే జలవనరుల శాఖ మంత్రి సహా కొంతమంది పేర్లను బయటపెట్టారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లుగానే సంకేతాలు వస్తున్నాయి.
కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు అవసరమైతే కెసిఆర్ , హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే వాళ్లకు నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ గోష్ రెడీ అవుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కేటీఆర్ వ్యవహారంతో భారత రాష్ట్ర సమితి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక కెసిఆర్ కు కూడా నోటీసులు ఇస్తే ఆ పార్టీకి కచ్చితంగా కష్టకాలమే. ఒకవైపు కేసులతో ఇబ్బంది పడుతూ పార్టీని ముందుకు నడపటం కష్టంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్ కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవడంతో ఎలా బయటపడాలనే దానిపై మల్లగుల్లాలు పడుతుంది ఆ పార్టీ. ఇక కెసిఆర్ పై కూడా కేసు నమోదు అయితే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉండవచ్చు.