Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2025-01-04 11:37:48
TWM News:-కారు డ్రైవరు అజాగ్రత్త, మితిమీరిన వేగం నలుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో హైదరాబాద్-మెదక్ రాష్ట్ర రహదారి(765(డీ)) పై శుక్రవారం ఉదయం ఓ కారు ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఓ ఆటో, దాని వెనకాలే ఉన్న మరో ట్రాలీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
గుమ్మడిదల:ఎస్సై మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన శంకర్ తన భార్యతో కలిసి కారులో మెదక్ వైపు నుంచి నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో నల్లవల్లి అటవీ ప్రాంతంలో హైదరాబాద్ లోని బాలానగర్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న ఆటోను, దాని వెనకాలే కూరగాయలతో వస్తున్న మరో ట్రాలీ ఆటోను ఢీకొన్నారు. కారు వేగం ధాటికి ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఇందులో నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన మనీషా(25), నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఐశ్వర్యలక్ష్మి(20), అదే మండలం ఎల్లారెడ్డిగూడకు చెందిన మాలోత్ ప్రవీణ్(30) ఉన్నారు. అలాగే కౌడిపల్లి మండలానికి చెందిన అనసూయ (62) ను సూరారం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆటో డ్రైవర్ సంతోష్, ట్రాలీ ఆటోడ్రైవర్ రాజు, కారు డ్రైవర్ శంకర్, ఆయన భార్య, రైతులు ప్రవీణ్, నవీన్ లకు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ లోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.