Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-12-21 10:00:54
TWM News:-మూడు వారాల క్రితం వాంకిడి గిరిజన వసతిగృహంలో 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందగా, తాజాగా అదే జిల్లాలో మరో వసతిగృహ విద్యార్థిని మరణించడం కలకలం సృష్టించింది.
ఆసిఫాబాద్: మూడు వారాల క్రితం వాంకిడి గిరిజన వసతిగృహంలో 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందగా, తాజాగా అదే జిల్లాలో మరో వసతిగృహ విద్యార్థిని మరణించడం కలకలం సృష్టించింది. తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బెజ్జూరు మండలం అందుగులగూడ గ్రామానికి చెందిన అనంద, పోశాలు దంపతుల మూడో కుమార్తె వెంకటలక్ష్మి (19) జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లోని బీసీ పోస్ట్మెట్రిక్ వసతిగృహంలో ఉంటూ.. స్థానిక స్త్రీనిధి కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్లోని ఓ ఉర్దూ మాధ్యమ పాఠశాలలో డీఎడ్ పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఒంటి గంటకు పరీక్ష ముగిసిన తర్వాత నీరసంగా ఉందని సహచరులకు చెప్పి సమీపంలోనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు తీసుకుని వసతి గృహానికి చేరుకుంది. క్యాబేజీ కూరతో భోజనం చేసింది. సాయంత్రం అయిదున్నర గంటల సమయంలో తలనొప్పిగా ఉందని సహచర విద్యార్థినులకు చెప్పి.. జండూబామ్ రాసుకుని పడుకుంది. అరగంట తర్వాత వెంకటలక్ష్మి కళ్లు తేలేయడంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.వార్డెన్ స్థానికంగా లేకపోగా, ఘటన జరిగిన తర్వాత కూడా వసతి గృహానికి రాకపోవడం గమనార్హం. ఈ విషయమై బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సజీవన్ మాట్లాడుతూ, వార్డెన్ సెలవు కావాలంటూ వాట్సప్ సందేశం పంపాడని, తాను అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
వెంకటలక్ష్మి నెల రోజుల క్రితం ఇంటికి వెళ్లిందని, పరీక్షలు రాయడం కోసం వారం క్రితమే వసతిగృహానికి వచ్చిందని తోటి విద్యార్థులు చెప్పారు. దగ్గు, జ్వరం ఉన్నట్టు చెప్పిందని శుక్రవారం కూడా అందరితో సరదాగా మాట్లాడిందని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం వెంకటలక్ష్మితో మాట్లాడానని, అప్పుడు ఆరోగ్యంగానే ఉందని మృతురాలి అక్క ఉమాదేవి తెలిపారు. వైద్యులు సరైన చికిత్స చేసి ఉంటే మృతిచెందేది కాదన్నారు.