Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-12-20 10:46:22
TWM News:-పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు శరీరంలో విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్ల లోపాన్ని తీరుస్తాయి. పాలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. అయితే కొంతమందికి పాలు అంటే అలెర్జీ కలగవచ్చు. ఈ విషయం అంత సులభంగా గుర్తించలేరు. పాలు మీకు సరిపోతాయా లేదా పాలు తాగడం వలన అలెర్జీ వస్తే.. దాని లక్షణాలు ఏమిటి. తెలుసుకుందాం..
పాలలో ఎన్నో పోషకాలున్నాయి. అయినా పాలు కొందరికి అలర్జీ అని నిపుణులు చెబుతున్నారు. ఎవరిలోనైనా రోగనిరోధక వ్యవస్థ పాల ప్రోటీన్లను సరిగ్గా గ్రహించలేనప్పుడు.. అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. పాలు తాగిన తర్వాత చర్మం ఎర్రబారడం, దురద, వాపు, దద్దుర్లు వంటి సమస్యలు ఉంటాయి.
ముఖం వాపు లేదా ముఖం ఉబ్బరం వంటి సమస్యలు కూడా కలగవచ్చు. ఈ లక్షణాలు ప్రత్యేకంగా కళ్ళ క్రింద, బుగ్గలపై కనిపిస్తాయి. కొంతమందికి ముఖంపై చిన్న దద్దుర్లు లేదా కురుపులు కూడా ఏర్పడవచ్చు.
ఈ భాగాలపై కూడా పాలు అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి
ఢిల్లీలోని శ్రీబాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని డెర్మటాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విజయ్ సింఘాల్ మాట్లాడుతూ.. ముఖంతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై కూడా పాలు అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. పాలు తాగడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, మలబద్ధకం వంటివి వస్తాయి. కనుక పాలు తాగిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలర్జీని సకాలంలో గుర్తించడం వలన లక్షణాలు తీవ్రం కాకుండా నిరోధించవచ్చు.
చికిత్స ఎలా తీసుకోవాలంటే
పాలు అలెర్జీని సాధారణంగా అలెర్జీని నియంత్రించే మందులతో చికిత్స చేస్తారు. వైద్యుల సూచనలను పాటించి ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు. ఎవరికైనా పాలు అంటే అలెర్జీ ఉంటే సాధ్యమైనంత వరకూ పాలు తాగకుండా ఉండటం చాలా ముఖ్యం. పాలకు బదులుగా కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఇతర ఆహారాన్ని తీసుకోవాలి.