Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-12-20 10:41:21
TWM News:-టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అయితే, స్టార్ ఆటగాళ్లు మాత్రం పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్నారు. సిరీస్‌ను గెలుపుతో ప్రారంభించిన భారత్, ఆ తర్వాత ఓటమి, మరో మ్యాచ్‌ను డ్రాగా మార్చుకుంది. అయితే, విరాట్ కోహ్లీ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన చిన్ననాటి కోచ్ భారతదేశాన్ని విడిచిపెడుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ బాంబు పేల్చాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించాడు. దైనిక్ జాగ్రన్ ప్రకారం, కోహ్లీ త్వరలో భారతదేశం వదిలి లండన్‌కు షిఫ్ట్ అవుతున్నాడని శర్మ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లి లండన్ వెళ్లనున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో కోహ్లీ తరచుగా లండన్ వీధుల్లో కనిపిస్తుంటాడు. దీంతో ఈ పుకార్లకు బీజం పడింది. ఈ క్రమంలో రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. అవును, విరాట్ లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను అతి త్వరలో భారతదేశం వదిలి వెళ్లిపోతాడు, అంటూ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.
కాగా, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ గొప్ప ఫామ్‌లో లేడు. బయటకు వెళ్లే బంతలును ఎదుర్కొనడంలో నిరంతరం కష్టపడుతున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయితే మెల్‌బోర్న్, సిడ్నీలలో కోహ్లి ఫాం అందిపుచ్చుకుంటాడని, సెంచరీలు సాధిస్తాడని శర్మ భావిస్తున్నాడు.
ఈ క్రమంలో మరో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, విరాట్ కోహ్లీలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు.