Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-07 11:13:44
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆంధ్రప్రదేశ్ అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు సాగుతోంది. రాష్ట్ర వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ దిశగా ముందడుగు వేసినట్టు కేంద్రం ప్రకటించిన గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరానికి భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించింది,
స్పష్టమైన ప్రణాళికలతో ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆ దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో వృద్ధి రేటులో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఎన్నో స్థానాలు ఎగబాకింది. కేంద్రం విడుదల చేసిన జాబితాలో 8.21 వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 9.18 శాతం వృద్ధి రేటుతో ఏపీ కంటే ముందు వరుసలో తమిళనాడు నిలిచింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చంద్రబాబు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా ఉంటుందని.. అప్పటికి తలసరి ఆదాయంలో దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అందుకోసం ఏం చేయాలనే ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నామని.. ఆ దిశగా ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరుతున్నారు.
ఏపీలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో విశాఖ లాంటి ప్రధాన ఓడరేవుల ద్వారా వాణిజ్యం పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విశాఖ ఓడరేవు 35.77 మిలియన్ టన్నుల ట్రాఫిక్‌ను నిర్వహించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎంతో పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది కోట్ల పెట్టుబడులు పెరగడం వృద్ధి రేటు పెరగడానికి కారణం. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడింది. పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ లాంటివి ఈ వృద్ధికి కారణమమయ్యాయి. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం, రవాణా సౌకర్యాల విస్తరణ లాంటి ప్రాజెక్టులు కూడా ఈ వృద్ధికి ఊతమిచ్చాయి.