Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-07 11:03:09
తెలుగు వెబ్ మీడియా న్యూస్:భారాస ప్రభుత్వం దశాబ్ద కాలంలో సాధించిన వృద్ధిని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దెబ్బతీసిందని భారాస సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. భారాస ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (కొవిడ్ సమయంలో మినహాయించి) 25.62 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించిందని.. రేవంత్రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. \"హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చారు. మూసీ రివర్ ఫ్రంట్ అంటూ హైదరాబాద్ అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించారు. మెట్రో లైన్ల ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకున్నారు. రాష్ట్రానికి కీలకమైన ఫార్మా సిటీని రద్దు చేశారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల కారణంగా వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది” అని హరీశ్రావు విమర్శించారు.