Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-07 10:47:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్:భారాసతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్న మొత్తం 112 ఓట్లలో భాజపాకు 27, భారాసకు 23, కాంగ్రెస్కు 13, ఎంఐఎంకు 49 ఉన్నాయని వివరించారు. \"బలం లేకపోవడం వల్లే ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నిలబడలేదు. మెజార్టీ లేని భాజపా.. భారాసతో ఉన్న రాజకీయ అవగాహన మేరకే నామినేషన్ వేసిందా? ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారాస అభ్యర్థిని పెట్టకుండా.. లోపాయికారీ ఒప్పందంతో భాజపాకు మద్దతు తెలిపింది. ఇప్పుడూ అదే జరుగుతోంది” అని ఆరోపించారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలను పరిశీలిస్తే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి.. భారాస నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోందని పొన్నం పేర్కొన్నారు.
దేహ్రాదూన్ వెళ్లిన మంత్రులు
సామాజిక న్యాయం-సాధికారత అంశంపై కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన ఈ నెల 7, 8 తేదీల్లో దేహ్రాదూన్లో జరగనున్న చింతన్ శివిర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సంక్షేమ శాఖల అధికారులు ఆదివారం బయలుదేరి వెళ్లారు.