Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:29:21
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో P4 పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్ట్‌నర్‌షిప్ కార్యక్రమం ఉగాది రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబును కొనియాడిన పవన్, తన రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనుకున్న కారణాలను వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇరు నాయకుల మధ్య ఉన్న సమన్వయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వీళ్ల ఐక్యతను ఛిన్నాభిన్నం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యాయి.P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో రూపొందిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజలు కలిసి పనిచేసే విధానాన్ని చంద్రబాబు రూపొందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే P4 కార్యక్రమం ఉండేది కాదు. రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారడం చంద్రబాబు నేతృత్వంలోనే సాధ్యం” అని అన్నారు. ఈ కార్యక్రమం ఉగాది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇంత బలమైన కార్యక్రమాన్ని గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన చెప్పారు. “చంద్రబాబు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు. అందరూ ఎదగాలనేది నా తాపత్రయం, చంద్రబాబు తాపత్రయం” అన్నారు పవన్ కల్యాణ్. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు విజన్‌కు పవన్ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేస్తున్నాయి.
తన రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలను పవన్ ఈ సందర్భంగా వివరించారు. “నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికాను. నాకు సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని 2014 నుంచి చంద్రబాబుకు మద్దతు ఇస్తూ వచ్చా” అని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో తాను బలంగా నిలబడటానికి కారణం కూడా చంద్రబాబు నాయకత్వమేనని పవన్ స్పష్టం చేశారు. పవన్ తన వ్యాఖ్యల్లో స్వీయ విమర్శనాత్మక ధోరణిని ప్రదర్శించారు. తనకు పూర్తి రాజకీయ సామర్థ్యం లేనందున ప్రజలకు ఉపయోగపడే నాయకుడికి తోడ్పాటు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ విధానం ద్వారా ఆయన చంద్రబాబుతో తన రాజకీయ భాగస్వామ్యాన్ని సమర్థించారు.చంద్రబాబు – పవన్ కల్యాణ్ మధ్య సామరస్యాన్ని చెడగొట్టేందుకు కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించినప్పటికీ, ఈ ఐక్యతను బలహీనపరిచేందుకు విమర్శలు, పుకార్లు వ్యాప్తి చేసే కుట్రలు జరుగుతున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. “ఎదిగే దశలో సరైన గైడెన్స్ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. చంద్రబాబు నాయకత్వం అలాంటి మార్గదర్శనం” అని పేర్కొనడం ద్వారా ఆయన చంద్రబాబుతో తన బంధాన్ని మరింత బలోపేతం చేశారు.పవన్ కల్యాణ్ కు తన స్థానంపై క్లారిటీ ఉన్నట్టు తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఐక్యత కూటమి ప్రభుత్వ బలాన్ని మరింత పెంచుతుంది. మరోవైపు.. స్వీయ విమర్శనాత్మక వైఖరి పవన్ కల్యాణ్ పరిపక్వతను చూపిస్తోంది. ఇది రాష్ట్ర ప్రజలకు మేలు చేసే నాయకుడికి తోడ్పడాలనే ఆయన ఆలోచనను స్పష్టం చేస్తుంది.