Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 10:36:57
తెలుగు వెబ్ మీడియా న్యూస్:రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వివాదం వెనుక గత పాలకుల దుష్ప్రచారం ఉంది. ఆ భూమి ప్రజలకు చెందిన రూ.వేల కోట్ల విలువైన ఆస్తి. దానిపై యాజమాన్య హక్కులను సాధించిన ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. వర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని అవాస్తవాలను ప్రచారం చేస్తుండటాన్ని ఖండిస్తున్నాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరాబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ తదితరులతో కలిసి మంగళవారం సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలేంటో రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
గత భారాస ప్రభుత్వం భూములపై గట్టిగా కొట్లాడలేదు: భట్టివిక్రమార్క
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) భూములను ప్రభుత్వం లాక్కుని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తోందని కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు. “2004లో ఉమ్మడి ఏపీలో అప్పటి తెదేపా ప్రభుత్వం వర్సిటీ నుంచి 400 ఎకరాలు తీసుకుని ఐఎంజీ భారత స్పోర్ట్స్ అనే ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. ఆ భూమికి బదులు 397 ఎకరాలను విశ్వవిద్యాలయానికి బదలాయించింది. తీసుకున్న భూమికి బదులు వేరే భూమి ఇస్తున్నట్లు ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయ అధికారులకు మధ్య ఒప్పందం, పంచనామా కూడా పూర్తయింది. 400 ఎకరాలు బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన సంస్థకు పోయాయి. ఆ తర్వాత 2006లో భూకేటాయింపును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో భారాస అధికారంలో ఉన్నా కేసుపై గట్టిగా కొట్లాడకపోగా గాలికి వదిలేసింది. రూ.వేల కోట్ల విలువైన భూమి వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం గట్టి నిర్ణయం తీసుకుంది. కోర్టులో కొట్లాడి హక్కులు సాధించుకున్నాం. ఈ భూములను అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనకు వినియోగమయ్యేలా ప్రభుత్వం చూస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు\" అని ఆయన స్పష్టం చేశారు.