Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 11:00:26
తెలుగు వెబ్ మీడియా న్యూస్:మార్పు రావాలి\' అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని.. మార్పు అంటే రైతులకు కన్నీళ్లా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలతో రైతులు వివిధవర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. భారాస రజతోత్సవ సభ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని, వారికి మనోధైర్యం ఇచ్చేవిధంగా సభ ఉండాలని కేసీఆర్ తెలిపారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ జిల్లా ముఖ్య నాయకులు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 2-2.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా బాధ్యతలను నేతలకు అప్పగించారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్రెడ్డికి.. పాలకుర్తి, వర్ధన్నపేటలను ఎర్రబెల్లి దయాకర్రావుకు.. వరంగల్ పశ్చిమను వినయభాస్కర్కు.. వరంగల్ తూర్పును నన్నపనేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్ డ్డిలకు..భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి.. నర్సంపేట, ములుగు నియోజకవర్గాల బాధ్యతలను పెద్ది సుదర్శన్రెడ్డికి.. పరకాలను చల్లా ధర్మారెడ్డికి.. మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్కు.. డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితలకు అప్పగించారు. జన సమీకరణపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలని, మండల, గ్రామ స్థాయుల్లో సమావేశాలు నిర్వహించాలని అధినేత సూచించారు. కనీసం రెండురోజులకో గ్రామం చొప్పున పర్యటించి, శ్రేణులను సమాయత్తం చేయాలని తెలిపారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడానికి ఎల్కతుర్తి సభాస్థలి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 15 నెలల పాలనపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ విమర్శించారు.