Responsive Header with Date and Time

పవన్ కల్యాణ్‌ కామెంట్స్.. ఆయనకు వరమా.. శాపమా..?

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:22:45


పవన్ కల్యాణ్‌ కామెంట్స్.. ఆయనకు వరమా.. శాపమా..?

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆంధ్రప్రదేశ్‌లో P4 పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్ట్‌నర్‌షిప్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నాకు సత్తా లేకపోవడం వల్లే చంద్రబాబుకు  మద్దతు ఇచ్చా” అని ఆయన చెప్పిన మాటలు ఒకవైపు ఆయన స్వీయ విమర్శనాత్మక ధోరణిని చూపిస్తుండగా, మరోవైపు ఆయన రాజకీయ సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒక రాజకీయ నాయకుడు తన చేతకానితనాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం ఆయన భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.P4 కార్యక్రమంలో సీఎం చంద్రబాబుని కొనియాడుతూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికాను. నాకు సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని 2014 నుంచి చంద్రబాబుకు మద్దతు ఇస్తూ వచ్చా’ అని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన తన రాజకీయ సామర్థ్యంపై ఆయనే సందేహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు తన అసమర్థతను బహిరంగంగా ఒప్పుకోవడం అరుదైన విషయం. ఆయన అనుచరులు, విమర్శకుల దృష్టిలో ఆయన ఇమేజ్‌ ఇకపై ఎలా ఉంటుందనేదానిపై చర్చ జరగడం సహజం.

పవన్ వ్యాఖ్యలను ఒక కోణంలో చూస్తే ఇది ఆయన చేతకానితనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడు తనలో సామర్థ్యం లేదని, అందుకే మరొకరికి మద్దతు ఇచ్చానని చెప్పడం ఆయన నాయకత్వ లక్షణాలపై సందేహాలను రేకెత్తిస్తుంది. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ధైర్యం, స్వీయ విశ్వాసం, స్పష్టమైన దృక్పథం అవసరం. పవన్ తనలో ఈ లక్షణాలు లేవని చెప్పడం ఆయన అనుచరుల్లో నిరాశను కలిగించే అవకాశం ఉంది. విమర్శకులు దీన్ని ఆయన రాజకీయ అసమర్థతకు ఆధారంగా చూపే ప్రమాదం కూడా ఉంది.మరోవైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై రెండు విధాలుగా ప్రభావం చూపవచ్చు. మొదటిది ఆయన ఇమేజ్‌కు హాని కలిగవచ్చు. జనసేన పార్టీని స్థాపించి, 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా విజయం సాధించిన నాయకుడిగా పవన్ ఇప్పటికే ఒక స్థానాన్ని సంపాదించారు. అయితే తనలో సత్తా లేదని చెప్పడం ఆయన పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటే, ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారవచ్చు. “సత్తా లేని నాయకుడు ప్రజలకు ఏం చేయగలడు?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి.ఇక రెండో కోణంలో పవన్ వ్యాఖ్యలను ఒక రాజకీయ వ్యూహంగా కూడా చూడవచ్చు. చంద్రబాబుతో తన బంధాన్ని మరింత బలంగా నొక్కి చెప్పారాయన. తద్వారా తానొక నిజాయితీపరుడినని, నమ్మకం కలిగిన నాయకుడినని చెప్పుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు. రాజకీయాల్లో స్వీయ విశ్వాసం కంటే ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం ముఖ్యమని చెప్పడం ద్వారా ఆయన కొంతమంది ప్రజల సానుభూతిని పొందే అవకాశం ఉంది. ఈ వైఖరి కూటమి ఐక్యతను మరింత బలపరచడంలో సహాయపడవచ్చు. మరి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఆయనకు వరంగా మారతాయా, శాపంగా మారతాయా అనేది వేచి చూడాలి.


 


Leave a Comment: