Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:20:27
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- రవాణా మార్గాలు పెరిగిన తర్వాత రోడ్డు ప్రయాణాలు సరదా మారిపోయాయి. ప్రయాణ ధోరణి ప్రారంభమైనప్పటి నుండి, ప్రజలు మరింత ఎక్కువ రోడ్డు ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. అయితే కారు తీసుకొని ప్రయాణం ప్రారంభించాలనుకుంటే, ముందుగా మ్యాప్‌ని చూసి, ఆ తర్వాత టోల్ ఎంత ఖర్చవుతుందో చూస్తాం. ఇటీవల టోల్ ట్యాక్స్ చూసిన తర్వాత, కొన్నిసార్లు మన ప్లాన్‌లను కూడా రద్దు చేసుకుంటాం. అయితే కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్‌లు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై మంగళవారం(ఏఫ్రిల్ 1) తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి.
హైదరాబాద్-విజయవాడ మార్గంలోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్‌ట్యాక్స్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్‌ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25 శాతం మినహాయింపు ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉంటాయని తెలిపింది.