Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-31 11:02:55
వైకాపా హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీయే ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం.
TWM News: వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పీహెచ్ఎ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారు. ఆయన పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టూ భర్తీ చేయలేదు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా.. ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతీగతీ లేకుండా వదిలేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది.