Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-16 11:15:47
తెలుగు వెబ్ మీడియా న్యూస్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు (MLAs) కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీ బలోపేతం, రాజకీయ వ్యూహాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతోంది. పార్టీ లైన్ దాటితే లాభం కంటే నష్టమే ఎక్కువ” అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలను హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని, ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటున్నారని విమర్శించారు. “ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదు. ప్రతిపక్షాలు మనపై దుష్ప్రచారం చేస్తుంటే, మీరు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమై, నియోజకవర్గాలకు వెళ్లకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించండి” అని సూచించారు.
మంత్రి పదవుల గురించి ఊహాగానాలు వద్దని, అవి అధిష్ఠానం నిర్ణయిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ కొందరు మంత్రి పదవులపై నోరు జారుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నష్టం మీకేనని నేరుగా చెప్పేశారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. “మీరు నియోజకవర్గంలో గెలవడానికి కావలసిన ప్రాజెక్టులు తెచ్చుకోండి. వాటిని పూర్తి చేయించే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు. “మన పథకాలతో ప్రధాని మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ హామీలైన కుల గణన, రైతు రుణమాఫీ, మహిళా సంక్షేమ పథకాలను తాము విజయవంతంగా అమలు చేశామని, ఇవి బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పారు.రాష్ట్రంలో బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై దూకుడు పెంచాయి. మరోవైపు సొంత పార్టీ నేతలే విచ్చలవిడిగా నోరు పారేసుకుంటున్నారు. పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ అవసరమని ఆయన భావించారు. అందుకే నేతలకు గట్టిగా హెచ్చరికలు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చురుగ్గా ఉండాలని, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ లక్ష్యాల కోసం కలిసికట్టుగా పనిచేయడం, ప్రజల్లో ప్రభుత్వ విజయాలను చాటడం, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంపై ఆయన దృష్టి సారించారు.