Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-16 11:08:45
తెలుగు వెబ్ మీడియా న్యూస్:తెలంగాణలో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు మధ్య రాజకీయ ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసిగిపోయారని, వారు ప్రభుత్వాన్ని కూల్చాలని కోరుకుంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఖర్చును కూడా భరిస్తామని వారు చెబుతున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం పేరాయి. కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో జరిగిన ఒక సమావేశంలో “పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు” అని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ చెప్పలేదని.. తాము ఆ పని చేయబోమని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఆలోచనలను మాత్రమే తాను చెప్పానన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌కు విరాళాలు ఇస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు.
దౌల్తాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర ఉందని.. తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుంటుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ విజయాలను ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తాను ప్రజల ఆలోచనలను మాత్రమే వ్యక్తం చేశానని పునరుద్ఘాటించారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ ను ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వంటి ఆరోపణలు రాజకీయ నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇవి బీఆర్ఎస్ ఇమేజ్‌కు కూడా నష్టం కలిగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఈ ఆరోపణలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటోంది.