Responsive Header with Date and Time

అమరావతికి ఐఆర్ఆర్ కూడా..!

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-31 10:42:44


అమరావతికి ఐఆర్ఆర్ కూడా..!

రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రప్రభుత్వం...అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులు, ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దానిలో భాగంగా ఐఆర్ఆర్ ప్రతిపాదననూ తెరపైకి తెచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా, కనీసం 20 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా ఎలైన్మెంట్ సిద్ధం చేయనుంది. దీనికి భూమిని భూసమీకరణ విధానంలో తీసుకోవాలని యోచిస్తోంది. గతంలో తెదేపా హయాంలో సుమారు 180 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ఆర్)తో పాటు, సుమారు 97.5 కి.మీ. పొడవైన అమరావతి ఐఆర్ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ.. తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో పాటు, ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ ప్రతిపాదనల్ని పూర్తిగా అటకెక్కించింది. ఇప్పుడు విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం, తూర్పు బైపాస్ కూడా నిర్మిస్తే అది ఒక రింగ్ రోడ్డులా ఏర్పడుతుంది కాబట్టి.. ప్రస్తుతానికి అమరావతికి ఐఆర్ఆర్ ప్రతిపాదన పక్కన పెట్టాలని రాష్ట్రప్రభుత్వం మొదట అనుకుంది. కానీ రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి... మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఐఆర్ఆర్ కూడా అవసరమేనని సూత్రప్రాయంగా నిర్ణయించింది.


గతంలో మూడు ప్రతిపాదనలు

అమరావతి, విజయవాడ చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీస్ రోడ్డుతో ఐఆర్ఆర్ నిర్మాణానికి గతంలో మూడు ఎలైన్ మొంట్లు సిద్ధం చేశారు. 2.5 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్, మరో 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్ పాత్ కూడా ప్రతిపాదించారు. అప్పట్లో రూపొందించిన మూడు ప్రతిపాదనలు..

ప్రతిపాదన 1:

ఐఆర్ఆర్ పొడవు 94.5 కి.మీ.
అవసరమైన భూమి: 1,165 ఎకరాలు;
నిర్మాణ వ్యయం: రూ.5,918 కోట్లు

ప్రతిపాదన 2:

పొడవు 97.5 కి.మీ
అవసరమైన భూమి: 1,253 ఎకరాలు
నిర్మాణ వ్యయం: రూ.6,878 కోట్లు

ప్రతిపాదన 3:

పొడవు 81 కి.మీ.
అవసరమైన భూమి: 785 ఎకరాలు
నిర్మాణ వ్యయం: రూ.4,698 కోట్లు


* వీటిలో రెండో ప్రతిపాదనను అప్పట్లో దాదాపు ఖరారుచేశారు. ఫేజ్-1, ఫేజ్-2లుగా విభజించి అంచనాలు రూపొందించారు. వాటిలో ఫేజ్-2 ప్రాజెక్టు కొంత దూరం కొత్తూరు, కొండపల్లి రిజర్వు అడవి మీదుగా వెళుతుంది. ఒకచోట 8 కి.మీ.ల మేర సొరంగం నిర్మించాలి.

అభివృద్ధికి ఆలంబన

• అమరావతితో పాటు, చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు, రాజధానికి మెరుగైన రోడ్డు అనుసంధానానికి ఐఆర్ఆర్ కీలకం.
• ఐఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు మెరుగైన    అనుసంధానం ఏర్పడుతుంది.
• ఐఆర్ఆర్ నిర్మాణంతో మెరుగైన అనుసంధానంతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం       ఏర్పడుతుంది.
• సుమారు 45వేల ఎకరాల భూమి అభివృద్ధికి ఓపెన్ అవుతుందని అంచనా.
• ఐఆర్ఆర్ కి వెలుపల కూడా కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది.
•ఐఆర్ఆర్ ని ఓఆర్ఆర్ తో అనుసంధానించే రహదారులకు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రత్యేక గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి  చెందుతాయి.
• సమీకరణ విధానంలో భూమిని తీసుకుంటే.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో భూసేకరణ భారం తగ్గుతుంది.



Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: