Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-31 09:26:18
TWM NEWS:న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రత్యర్థి కమలా హారిస్తో చర్చిస్తానో లేనో చెప్పలేనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ భేటీకి ఉన్న విలువెంత అని ఆయన ప్రశ్నించారు. చర్చిస్తే చర్చిస్తాను. లేదంటే అలా చేయకుండా ఉండడానికి కారణాన్ని చెబుతాను అని అన్నారు. విలేకరి పదేపదే నొక్కి అడిగినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించారు. తానెవరో, హారిస్ ఏమిటో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలయ్యేందుకు ముందే ఎలాంటి ముఖాముఖి అయినా జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నప్పుడు ఆయనతో డిబేట్కు ట్రంప్ ఉత్సాహం చూపించడం, తర్వాతి పరిణామాల్లో రేసు నుంచి బైడెన్ వైదొలగాల్సి రావడం తెలిసిందే. కమలతో ముఖాముఖి చర్చకు ట్రంప్ బయపడుతున్నారని ఆమె శిబిరం ఎద్దేవా చేస్తోంది. ఈసారి తాను ఎన్నికైన తర్వాత క్రైస్తవులు ఇకపై ఎంతమాత్రం ఓటువేయడానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ సమాధానం చెప్పాల్సి రావడం కూడా మరో కారణమని పేర్కొంటోంది.
దాడిని లైవ్ లో చూసి ఆందోళన చెందిన మెలనియా
తనపై జరిగిన హత్యాయత్నాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో చూసి తన సతీమణి మెలానియా ఆందోళనకు గురయ్యారని, కాసేపు ఏమీ మాట్లాడలేకపోయారని ట్రంప్ చెప్పారు. ఆ ఘటన తర్వాత కూడా తాను బహిరంగ ర్యాలీల విషయంలో వెనకడుగు వేయనని స్పష్టంచేశారు.
కమలా హారిస్ స్ఫూర్తిదాయక నేత: బైడెన్
పౌరహక్కుల కోసం ఉద్యమించడంలో అగ్రగణ్యురాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్ఫూర్తిదాయక నేత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.