Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-30 10:56:43
ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆడతాడా? లేదా అనే దానిపై స్పష్టత లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఫినిషర్ వచ్చి అభిమానులను అలరించిన ధోనీ వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా అనే దానిపై స్పష్టత లేదు. బీసీసీఐ (BCCI) తీసుకొనే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో చాలామంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. అయితే, ఫ్రాంఛైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కో ఫ్రాంఛైజీ అయిదుగురు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొనే అవకాశం కల్పిస్తేనే వచ్చే సీజన్ లో ధోనీ ఆడటానికి ఛాన్స్ ఉంటుందని సమాచారం.
భవిష్యత్ అవసరాలను దృష్టిలోపెట్టుకొని మెగా వేలంలో సీఎస్కే (Chennai Super Kings) రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశా పతిరణ, శివమ్ దూబెలను రిటైన్ చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు, ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై చర్చించడానికి బీసీసీఐ జులై 31న ప్రాంఛైజీల యజమానులతో సమావేశం కానుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్ లో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగే అవకాశముంది. ఈమేరకు సమాచారాన్ని ప్రాంఛైజీ ఓనర్సు అందించారు. ఒక్కో జట్టు 5-6 ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తుందని సమాచారం. ఇలా జరిగితే ధోనీని వచ్చే సీజన్లో మరోసారి మైదానంలో చూసే అవకాశం దక్కుతుంది. 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుని ఐదో స్థానంలో నిలిచింది.