Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-30 10:41:23
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్ (Manu Bhaker) అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది.
Paris Olympics 2024 | ఇంటర్నెట్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్ (Manu Bhaker) అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది.వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకం సాధించిన మను బాకర్ నేడు (జులై 30) మరో పతకాన్ని అందుకునే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్జ్యోత్తో కలిసి బరిలోకి దిగనుంది. దక్షిణ కొరియా ద్వయం (లీ-యెజిన్)త మధ్యాహ్నం 1 గంటకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఇందులో గెలిచి కాంస్య పతకం దక్కించుకుంటే మను బాకర్ అరుదైన రికార్డు అందుకుంటుంది. స్వాతంత్య్రం తర్వాత ఒక ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్గా చరిత్రలో నిలిచిపోనుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు సాధించాడు. బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ అయిన ఇతడు 1900 ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారత అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించలేదు.
అయితే, తమ కెరీర్లో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో సుశీల్ కుమార్ కాంస్య పతకం అందుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సుశీల్ రజతం సాధించాడు. పీవీ సింధు (బ్యాడ్మింటన్) 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడి రజతం అందుకుంది. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత్ కు రజత పతకం రావడం ఇదే తొలిసారి. తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం గెల్చుకుంది.