Category : |
Sub Category : రాజకీయం Posted on 2024-09-13 13:11:52
జగన్ హయాంలో భారీ కుంభకోణం వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు.. ఆధారాలు లభ్యం వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు
జగన్ హయాంలో గత ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రూ.2,566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అన్నీ తానై సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన ఈ కీలక అంశాలు, ఆధారాలు బయటపడ్డాయి. దీంతో వీజీ వెంకటరెడ్డిపై బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలను, వాటి ప్రతినిధులను నిందితులుగా చేర్చింది. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయా సంస్థల కార్యాలయాలు, వీజీ వెంకటరెడ్డి, ఇతర నిందితుల ఇళ్లల్లో గురువారం సోదాలు నిర్వహించింది. గత రెండు నెలలుగా పరారీలో ఉన్న వెంకటరెడ్డి ఆచూకీ కోసం ఆరా తీస్తోంది.
బ్యాంకు గ్యారంటీలు వెనక్కి తీసుకునేందుకు ఎన్ ఓ సీ
ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకటరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీవీఎల్ సంస్థ ప్రభుత్వానికి రూ.800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ సమర్పించిన రూ.120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్ఎసీ జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వెంకటరెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి, తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు తేల్చింది. అన్ని జిల్లాల్లోని గనుల శాఖ కార్యాలయాలు, ఇసుక రీచ్లను సందర్శించిన ఏసీబీ బృందాలు.. ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేశారు.
• ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానంలో ఆయా సంస్థలు పాటించాల్సిన నిబంధనలు పేర్కొన్నా.. క్షేత్రస్థాయిలో అవేవీ అమలు కాలేదు. పైగా అందుకు విరుద్ధంగా వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వెంకటరెడ్డి ఈ అక్రమాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారు.
• గుత్తేదారు సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించారు. తద్వారా ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకునేందుకు అవకాశం కల్పించారు. ఒప్పందం ప్రకారం ప్రతినెలా 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేటు సంస్థలు టెండరులో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. వారు నెలల తరబడి సొమ్ము జమచేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా బకాయిలు ఉన్నప్పటికీ ఆయా సంస్థల బ్యాంకు గ్యారంటీల సొమ్ము వెనక్కి తీసుకునేందుకు ఎన్ఎసీలు ఇచ్చేశారు.
• జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబరు వరకూ ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. 2023 డిసెంబరు నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జేసీకేసీ, ప్రతిమ ఇన్ ఫ్రా సంస్థలకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారు.
\r\n
ఏపీఎండీసీ మాజీ ఎండీ బంధువు ఇంట్లో ఏసీబీ సోదాలు?
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డిపై అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అతని అత్తగారింట్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు పత్రాలను పరిశీలించినట్లు సమాచారం. గత వైకాపా పాలనలో ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో, ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి, విచారణ జరిపిస్తోంది.
లీజు హద్దులు దాటేశారు..
ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఇసుక రిచ్ ల లీజు హద్దులు దాటేసి మరీ ఆ సంస్థలు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు అని ఏసీబీ గుర్తించింది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వీజీ వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేల్చింది.