Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-29 11:35:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోనకు చెందిన వెంకటేశ్వర్లును టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆయనను సన్మానించి.. ప్రశంసాపత్రాన్ని అందజేశారు...
అచ్చంపేట హైదరాబాద్ రూట్ టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఈ నెల 26న కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎంజీబీఎస్ కు చేరుకోగానే బస్సులో ఒక బ్యాగ్ ను ప్రయాణికుడు మరచిపోయినట్లు కండక్టర్ గుర్తించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, పలు సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్‌కు ఫోన్‌లో కండక్టర్ సమాచారం అందించారు. బ్యాగ్ ను ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డీఎం సూచించారు...
ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూర్‌లో బస్సు ఎక్కి సీబీఎస్ లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డీఎం సూచించారు...
టీజీఎస్ఆర్టిసీ అధికారులు వివరాలను పరిశీలించి.. బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్‌కు అందజేశారు. అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్, తన విద్యార్హత ధ్రువపత్రాలు ఉన్నాయి...
విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.13 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లు ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే ఎక్స్ట్రా మైల్ దిశగా సమాజంలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు....