Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2025-04-29 11:05:29
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వస్తూ ఐదుగురు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లి శివారులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాకాల రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరిన ఏడుగురు వ్యక్తులు, పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టారు. దీంతో కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నుజ్జునుజ్టు అయ్యింది. దీంతో ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వృద్ధుడు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ కింద చిక్కుకున్న కారు అతికష్టం మీద బయటకు తీసిన పోలీసులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.