Category : | Sub Category : క్రీడా Posted on 2024-09-12 16:02:48
తెలుగు వెబ్ మీడియా న్యూస్: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టునకు కాన్పూర్ వేదిక. సెప్టెంబర్ 27
నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. అయితే, మ్యాచ్ జరగకుండా నిరసనలు తెలిపేందుకు హిందూ మహాసభ సిద్ధమైందనే వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఆ దేశ క్రికెట్ జట్టు పర్యటనను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే, మ్యాచ్ నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్పూర్ నుంచి కదలించేదే లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టంచేశాయి. ఇతర వేదికలను పరిశీలించడం లేదని పేర్కొన్నాయి.
ఈ బెదిరింపులకు సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్నాం. మ్యాచ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే క్రికెటర్లకు ఘన స్వాగతం పలుకుతాం. ఇలాంటి పరిస్థితి కాన్పూర్ లోనే కాకుండా ఇతర మైదానాల వద్ద ఉన్నా సరే మేం చర్యలు తీసుకుంటాం అని బీసీసీఐ సీనియర్ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే పాక్ ను ఓడించి జోరు మీదున్న బంగ్లా భారత్ కు గట్టి పోటీనివ్వాలనే కృతనిశ్చయంతో ఉంది.
ఇప్పటికే తొలి టెస్టు కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ స్క్వాడ్ లోకి సీనియర్లు బుమ్రా, విరాట్ వచ్చేశారు. చాన్నాళ్ల తర్వాత రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ పునరాగమనం చేశారు. యువ ఆటగాడు సర్ఫరాజ్ కు అవకాశం వచ్చినా.. తుది టీమ్ లో కష్టమే. దీంతో మళ్లీ అతడు దేశవాళీ దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్లో ఆడుతున్నాడు. ఒకవేళ అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తే తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఖలీద్ మహమూద్ రాజీనామా!
బంగ్లాదేశ్ క్రికెట్లో మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ కూడా పదవిని వదిలేసినట్లు సమాచారం. 2013 నుంచి వరసగా మూడు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగాడు.