Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-14 10:17:19
తెలుగు వెబ్ మీడియా న్యూస్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 83 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. పామ్ సండే పండగ సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఆరోపించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
అలా జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులు
ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది. ఒకవైపు శిథిలాలు, భారీగా వెలువడుతున్న పొగ ఉండగా మరోవైపు జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఉంది. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు రెండు దేశాల మధ్య అమెరికా ఇంతకుముందు మధ్యవర్తిత్వం వహించింది. ఆ చర్చల సందర్భంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దాడులు చోటుచేసుకున్నాయి.