Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-09 10:04:55
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. డ్రాగన్‌పై భారీస్థాయిలో సుంకాలతో అగ్రరాజ్యం విరుచుకుపడింది. చైనా వస్తువులపై టారిఫ్‌లను ట్రంప్ సర్కార్ 104 శాతానికి పెంచింది. ఏప్రిల్ 9 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని శ్వేతసౌథం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ట్రంప్ విధించిన 34 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా 34 శాతం సుంకాలను ప్రకటించింది.
అందుకు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలని లేదంటే ప్రతీకార సుంకాలను మరింత పెంచుతానని బెదిరించారు. ఇందుకు ధీటుగా స్పందించిన చైనా సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై భారీగా ప్రతీకార సుంకాలను 50 శాతం పెంచింది.
దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. వారం వ్యవధిలోనే చైనాపై సుంకాలు 10 శాతం నుంచి 104 శాతానికి చేరుకున్నాయి. గత నెల వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకం విధించేది. ఏప్రిల్ 2న చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాన్ని ప్రకంటించడం వల్ల 44 శాతానికి చేరింది. కొద్దిసేపటి తర్వాత అదనంగా మరో 10 శాతం నాన్ రెసిప్రొకల్ టారిఫ్‌ను వసూలు చేస్తున్నట్లు శ్వేతసౌథం ప్రకటనతో చైనా సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి. తాజాగా ప్రతీకార సుంకాలను అదనంగా మరో 50 శాతం విధించడం వల్ల చైనా వస్తువులపై టారిఫ్‌లు 104 శాతానికి ఎగబాకాయి.