Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-02-07 11:51:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగానే అందరితో చర్చించి అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రూ.21 వేల కోట్లకు పైగా వెచ్చించి రైతు రుణమాఫీ అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, రైతు భరోసాను పటిష్ఠంగా అమలు చేస్తే సరిపోయేదని అభిప్రాయపడినట్లు సమాచారం. సీఎల్పీ సమావేశంలో రాజగోపాల్రెడ్డితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు.ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది. అందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడు అర్హుల జాబితా ప్రకటించడం ఎందుకు? చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేకపోతున్నాం. రోడ్లు కూడా సరిగా లేవు. డబ్బుల్లేనప్పుడు కొత్త పథకాలేందుకు అని ప్రశ్నించినట్లు సమాచారం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ... నాలుగు గ్రామాల్లో సీలింగ్లో భూములు కోల్పోయిన వారే మళ్లీ ఆ భూములను వినియోగించుకొంటున్నారు. ఎన్నికలప్పుడు ఆ గ్రామాలకు ప్రచారానికి కూడా రానీవ్వలేదు. ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 ఎకరాల వరకు ఉంది. ఈ భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు” అని పేర్కొన్నట్లు తెలిసింది. మొత్తం మూడు అంశాలను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.
ఆ వివరాలను సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి అందజేస్తానని పేర్కొని ఆ మేరకు సీల్డ్ కవర్లు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన డిన్నర్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే అనిరుథ్రెడ్డి లేవనెత్తిన అంశంపై ఎవరూ ఏమీ స్పందించలేదని తెలిసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు పెంచడంతోపాటు వివిధ పనులకు దానిని అనుసంధానం చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమని, మూడు దశాబ్దాల కల నెరవేరినట్లయిందని పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితోపాటు మరికొందరు కూడా మాట్లాడారు.