Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-02-07 11:39:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలుంటే పార్టీకి చెప్పాలి తప్ప బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదని, అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదముంటుందని.. ఎవరూ పార్టీ గీతను దాటొద్దని, ఇలాంటివి ఎవరు చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ తప్పనిసరిగా విజయం సాధించాలని.. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించి చెప్పడానికి అంతా కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చివర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాను
ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాను. నాతో చెప్పడం కుదరకపోతే పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి లేదా ఏఐసీసీ పెద్దలకు.. ఇలా ఎవరికైనా చెప్పొచ్చు. ఇలా చెప్పుకోవాలనుకునేవారికి కావాలంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. పార్టీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడవచ్చు. అంతే తప్ప బహిరంగంగా మాట్లాడటం, రహస్యంగా.. గ్రూపులుగా సమావేశం కావడం సరైన విధానం కాదు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 70 శాతం వరకు ఉన్నారు. మొదటిసారి కంటే రెండోసారి గెలుపొందడం ముఖ్యం. రెండోసారి నెగ్గాలంటే ఎప్పుడూ జనంలో ఉండాలి తప్ప హైదరాబాద్లో కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయండి. అత్యధిక స్థానాలు నెగ్గేందుకు పార్టీ శ్రేణులంతా కలసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలను కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, కులగణనను విజయవంతంగా పూర్తి చేయడం లాంటి అంశాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు
రాజకీయాల్లో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోకుండా బహిరంగంగా ఏమైనా మాట్లాడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలి. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు విందు పేరుతో కలిశారు. కానీ, ఏదో మాట్లాడుకున్నట్లు బయటకు వచ్చింది. ఇలాంటి వాటివల్ల మీరు మునగడమే కాదు.. పార్టీకీ నష్టమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అడిగే వాటిలో కొన్ని చేయగలిగేవి ఉంటాయి. కొన్ని చేయలేనివి ఉంటాయి. సొంతమా.. ప్రజలకు సంబంధించినవా? ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం చేసే మంచి పనులు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే.