Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2025-01-07 15:28:20
TWM News:-ఒక వ్యక్తి చనిపోయినట్లు వైద్యుడు ప్రకటించాక, దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా, అకస్మాత్తుగా ఆయన లేచి కూర్చుంటే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ ఘటన నిజంగానే జరిగింది.
ఇదొక ఆశ్చర్యపరిచే విషయమైనప్పటికీ, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది.
‘కస్బా బావ్డాలో ఓ పెద్దాయన చావు దగ్గరికి వెళ్లి వచ్చాడు’ అని కొల్హాపూర్ ప్రాంతంలో విపరీతంగా ప్రచారం జరిగింది.
ఆ ప్రాంతవాసులు దీనికి ఆశ్చర్యపోతుండగా, మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌గా మారింది.
65 ఏళ్ల వృద్ధుడు పాండురంగ్ ఉల్పే విషయంలో ఇదంతా అచ్చం ఓ సినిమాలోలా జరిగింది. ఆయన మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించారు. బంధువులందరికీ కూడా సమాచారం అందించారు.
దహన సంస్కారాల కోసం ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకెళుతుండగా, దారిలో ఆయనలో కదలిక కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన బతికే ఉన్నారని అక్కడి వైద్యులు నిర్ణయించారు.
చికిత్స అందించడంతో ఆ వృద్ధుడు పూర్తిగా కోలుకుని, ఇంటికి తిరిగొచ్చారు.
అయితే, అంతకుముందు ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, ‘ ఆయన చనిపోయినట్టే, బంధువులని పిలవండి, ఇంటికి తీసుకెళ్లండి' అని ఫోన్ చేసి చెప్పారని పాండురంగ్ ఉల్పే కుటుంబీకులు తెలిపారు. అయితే, ఆసుపత్రి పేరు లేదా డాక్టర్ పేరును వారు వెల్లడించలేదు.
ఈ విషయంలో అలసత్వం వహించారని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్థానిక ప్రభుత్వ వైద్య నిపుణులు తెలిపారు.
అసలు పాండురంగ్ ఉల్పేకు ఏమయింది? ఈ కేసులో డాక్టర్లదే నిర్లక్ష్యమా?
మీ తాత చనిపోతున్నాడు' అని డాక్టర్ అన్నారు.
పాండురంగ్ ఉల్పే మనవడు ఓంకార్ రమణే ఈ కేసుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బీబీసీకి అందించారు.
డిసెంబరు 16 తేదీ సాయంత్రం సమయంలో పాండురంగ్ ఉల్పేకు సుస్తీ చేసింది. దీంతో కుటుంబసభ్యులు సాయంత్రం ఆరున్నర సమయంలో చికిత్స నిమిత్తం గంగావేష్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పాండురంగ్ ఉల్పేకు గుండెపోటు వచ్చిందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన ఒకే ఒక్క కూతురిని, అల్లుడిని ఆస్పత్రికి పిలిపించారు.
ఒకవైపు చికిత్స జరుగుతుండగానే, పాండురంగ్ ఉల్పే శరీరంలో కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. ఆయన గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయింది. చివరకు ఆయన మరణం అంచుల్లో ఉన్నారని, బతకడం కష్టమని రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో డాక్టర్లు చెప్పారని ఓంకార్ తెలిపారు.
ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ సూచించారు. దీంతో కుటుంబసభ్యులు 17వ తేదీ అర్ధరాత్రి అంబులెన్స్‌లో పాండురంగ్ ఉల్పేను ఇంటికి తీసుకెతుండగా...ఆయన శరీరంలో కదలికలు కనిపించాయి.
స్పీడ్ బ్రేకర్ కుదుపుతో కథ మారింది.
ఓ వైపు ఇంట్లో పాండురంగ్ ఉల్పే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా, కుటుంబీకులు ఉల్పేను ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొస్తున్నారు. అప్పుడే కథ మలుపు తిరిగింది.
ఉల్పేను తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌పైనుంచి వెళ్లగా... వాహనంతోపాటు పాండురంగ్ శరీరం కూడా ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కొద్ది క్షణాల తర్వాత ఉల్పే వేళ్లు కదలడాన్నిఆయన మనవడు ఓంకార్ రమణే గమనించారు.
వెంటనే తన వద్ద ఉన్న ఆక్సిమీటర్‌తో తన తాత శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని పరిశీలించినట్లు ఓంకార్ తెలిపారు. ఆయన బతికే ఉన్నట్టు గుర్తించిన వెంటనే అంబులెన్స్‌ను కస్బా బావ్డా పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఆసుపత్రి వైద్యుల ప్రయత్నాలతో డిసెంబర్ 17 మధ్యాహ్నం 3 గంటలకల్లా ఉల్పే స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనకు చికిత్స కొనసాగించారు వైద్యులు. పూర్తిగా కోలుకుని డిసెంబర్ 30న ఇంటికి చేరుకున్నారు ఉల్పే. కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఉల్పే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన వీడియోతో పాటు, జరిగిన కథంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఆయనను ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆయన చనిపోతున్నారని చెప్పిన వైద్యుడు ఎవరు అన్న వివరాలను మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.
పాండురంగ్ ఉల్పే స్పృహలోకి ఎలా రాగలిగారు అని డా. అని దేశ్‌ముఖ్‌ను బీబీసీ అడిగింది.
"కార్డియాక్ అరెస్ట్‌తో గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. అటువంటి సందర్భాలలో, మేం రోగికి సీపీఆర్ చేస్తాం, లేదా గుండెను తిరిగి కొట్టుకోవడానికి గుండెలోకి ఇంజెక్షన్ చేస్తాం." అని వివరించారు.
అంబులెన్స్ స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళ్లడంతో పాండురంగ్ ఉల్పే షాక్‌కి గురై ఉంటారని, ఆ షాక్ వల్లే ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలై ఉండవచ్చని డాక్టర్ తెలిపారు.
ఇదిలా ఉండగా..పాండురంగ్ ఉల్పే మృతి చెందినట్లు ప్రకటింటిన వైద్యులు కానీ, ఆస్పత్రిగానీ ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు. ఆ ఆసుపత్రి పేరు వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
కుటుంబ పెద్ద మరణం అంచులదాకా వెళ్లి తిరిగి రావడం ఆ కుటుంబానికి ఒక అద్భుత సంఘటన. అయితే ఒకవేళ దారిలో స్పీడ్‌బ్రేకర్ లేకపోయుంటే ఏమిటి పరిస్థితి? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అది లేకపోయుంటే ఒక వైద్యుడి నిర్లక్ష్యం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపి ఉండేది.