Category : వ్యాపారం | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2025-01-08 13:34:30
TWM News:-ఏపీలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఏపీకి క్యూ కడుతున్నారు. సంక్రాంతి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది ఏపీఎస్ ఆర్టీసీ. ఎలాంటి ప్రయాసలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రతి ఒక్కరికి బస్సులో సీటు దొరికేలా ఏర్పాట్లు చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పండగ సంక్రాంతికి అదనపు బస్సులను నడుపుతోంది ఏపీఎస్ ఆర్టీసీ. ఈనెల 13 వరకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు 2 వేల 153 బస్సులను నడుపుతోంది. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, వైజాగ్ నుంచి 250, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర నగరాలు, పట్టణాల నుంచి 500 సర్వీసులు నడపనున్నారు. తిరుగు ప్రయాణానికి 3300 బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమైన పాయింట్ల నుంచి బస్సులు నడిపనుంది ఏపీఎస్ ఆర్టీసీ. మొత్తంగా పండుగ సమయంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ 7,200 సర్వీసులను నడపనుంది.
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలుండవన్నారు అధికారులు. సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. హైదరాబాద్, ఇతర నగరాల్లో బస్సుల పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సేవలను పొందేందుకు ప్రయాణికులు 149 లేదా 0866-257005కు కాల్ చేయవచ్చు.
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 9న కాకినాడ టౌన్ – వికారాబాద్, 10న వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్, 11న శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి, 12న చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సంక్రాంతి పండగ కోసం ఇప్పటికే పట్నం వాసులు పల్లె బాట పట్టారు. మరికొందరు టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు.