Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2025-01-07 11:30:45
TWM News:-బతుకులు మారుతాయని వ్యవసాయం కోసం అప్పులు తెచ్చాను.. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులు పెరిగాయి.
భూపాలపల్లి రూరల్: వాటికి వడ్డీ కట్టలేక ఏంచేయాలో అర్థం కావడం లేదు.. తమ్ముడూ.. అమ్మను మంచిగ చూసుకో.. అన్నలా తోడు ఉండాల్సిన నేను కుటుంబ బాధ్యతలు వదిలి పోతున్నందుకు నన్ను క్షమించు\' అని లేఖ రాసిన యువ రైతు ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామకు చెందిన నీలాల శేఖర్ (29)కు తల్లి, తమ్ముడు ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో పిల్లలను తల్లి పెంచి పెద్ద చేసింది. అవివాహితుడైన పెద్ద కుమారుడు శేఖర్ ఇంటి బాధ్యతలు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్న నాలుగు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేశారు. పెట్టుబడికి రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. దిగుబడి తక్కువగా రావడం, గిట్టుబాటు ధర రాకపోవడం, అప్పులవారు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నెల 1న పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి భూపాలపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ తెలిపారు.