Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-06 13:52:35
TWM News:-బయట చిరుతిళ్లు అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తినేది పానీపూరీ అని చెప్పొచ్చు. దేశంలోని ముఖ్యంగా నగరాల్లో.. దాదాపు ప్రతి వీధిలోనూ ఇది కనిపిస్తుంది. ఇది తినడం ప్రారంభిస్తే.. ఎన్ని తింటామో కూడా లెక్కే ఉండదు. తింటున్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టం ఉంటుంది. పానీ పూరీ ఎలా తయారు చేస్తారో.. స్వచ్ఛత గురించి ఎన్ని వీడియోలు బయటకి వచ్చినా.. వీటిని తినడం మాత్రం ఆపరు. ఇదే పానీపూరీ అమ్ముకునే చిరు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు దీనికి సాక్ష్యంగా నిలిచిందో కథనం. దీనిని చూస్తే.. పానీపూరీతో ఇంత సంపాదిస్తున్నారా అని ముక్కున వేలు వేస్కోవాల్సిన పరిస్థితి.
తమిళనాడులోని ఒక పానీపూరీ విక్రేతకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీఎస్టీ విభాగం నోటీసులు పంపించింది. టాక్స్ కట్టకుండా లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నావని ప్రశ్నించింది. అయితే పానీపూరీ అమ్ముకునే వ్యక్తికి జీఎస్టీ నోటీసులు ఎందుకొస్తాయిలే అని మనం అనుకొని లైట్ తీసుకుంటాం. చిన్నాచితకా బిజినెస్ చేసుకుంటూ టాక్స్ కట్టమంటరా అనుకుంటుంటారు. అయితే ఆ వ్యాపారి ఎంత సంపాదించాడో తెలిస్తే మీరు కూడా షాకవ్వాల్సిందే.2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే ఏడాది వ్యవధిలో పానీపూరీ బిజినెస్‌తో ఏకంగా రూ. 40 లక్షలపైన సంపాదించాడని.. దాని కోసం పన్ను చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాలని.. గత రెండు, మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ వివరాలు కూడా తీసుకురావాలని అడిగారు. భారతదేశంలో ఆదాయంపై బట్టి టాక్స్ ఉంటుంది. నిర్దిష్ట ఆదాయం దాటితే పన్ను శ్లాబుల్ని బట్టి టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా.. ఈ రూ. 40 లక్షల వరకు కేవలం రాజోర్‌పే, ఫోన్ పే వంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినవి మాత్రమే. ఇవన్నీ అతడి అకౌంట్లో పడ్డట్లు గుర్తించారు. ఇంకా నగదు రూపంలో ఎంత వచ్చి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.
ఇంకా జీఎస్టీ చట్టం ప్రకారం.. సదరు పానీపూరీ వ్యాపారి.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నాడని తేలింది. జీఎస్టీఎన్ నంబర్ తీసుకోకుండా.. పేరు నమోదు చేసుకోకుండా వ్యాపారం చేస్తున్నందుకు అతడు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జీఎస్టీ చట్టం - 2017 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలకు మించి టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారి కూడా జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకొని.. జీఎస్టీ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది.