Responsive Header with Date and Time

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు: సుప్రీంకోర్టు తీర్పు

Category : జాతీయ | Sub Category : తాజా వార్తలు Posted on 2025-01-06 13:43:56


తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు: సుప్రీంకోర్టు తీర్పు

TWM News:-కన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి బిడ్డలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన కొడుకులు, కూతుళ్లకు ఆస్తిని పొందే హక్కులేదని తేల్చి చెప్పింది. తల్లిదండ్రుల ఆస్తిని తీసుకుని, వారి బాగోగులు చూడకుండా వదిలేసిన ఓ ప్రబుద్ధిడి కేసుపై తీర్పునిస్తూ సుప్రీం కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.


న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కన్నతల్లి 

వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పాడు. దీనితో అతని కన్నతల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్‌ సి.టి.రవికుమార్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం, ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దుచేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్​ కీలక వ్యాఖ్యలు చేసింది. "బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన 'తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం' అండగా నిలుస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు - కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయి. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తి హక్కులను తిరిగి తమకే దక్కేలా చేయాలని కోర్ట్​లను ఆశ్రయించవచ్చు. ట్రైబ్యునళ్లు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వవచ్చు. తద్వారా వయోధికులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుంది" అని ధర్మాసనం పేర్కొంది.

ఆస్తి కావాలి - కానీ తల్లిదండ్రులు వద్దు!

మధ్యప్రదేశ్​ చిత్తార్​పుర్​కు చెందిన ఓ మహిళ తన కుమారుడికి కొంత ఆస్తిని గిఫ్ట్​ డీడ్​ రూపంలో రాసిచ్చింది. కానీ అతని ఆశ అక్కడితో తీరలేదు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడమే కాకుండా, మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలని కోరుతూ వారిపై దాడి చేశాడు. దీనితో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దుచేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆ వృద్ధ మహిళ వేడుకుంది. దీనిపై విచారణ జరిపిన సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దుచేసి వయోధికుల ఆస్తి హక్కును పునరుద్ధరించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికే ఆస్తి దక్కుతుందని పేర్కొంది. బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించింది. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా కన్న తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించాలని పేర్కొంటూ కుమారుడికి ఆదేశాలు జారీచేసింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: