ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. మరో రెండు గ్యారెంటీలపై సోనియాతో చర్చ.. కీలక రిక్వెస్ట్....
Category : |
Sub Category : రాజకీయం Posted on 2024-02-06 10:36:14
TWM News :- సీఎం రేవంత్‌రెడ్డి మరో ఇద్దరు మంత్రులతో కలిసి ఢిల్లీలో పర్యటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియాగాంధీని కలిశారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో హామీల అమలు తీరును వివరించడంతోపాటు.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగాలని సోనియాను కోరారు రేవంత్ సారథ్యంలోని బృందం. అటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే అంశంపై పోరుకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రకటన:
ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సోనియా నివాసానికి వెళ్లారు రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరారు. ఇప్పటికే.. సోనియా పోటీ విషయంపై టీ.కాంగ్రెస్ తీర్మానం చేసింది. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, రాబోయే రోజుల్లో అమలు చేయనున్న పథకాలను సోనియాగాంధీకి వివరించారు రేవంత్‌రెడ్డి బృందం. ప్రభుత్వ పరంగా.. పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నారనేదానిపై తెలియజేశారు. తాజాగా.. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి కూడా సోనియాకు తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం గురించి సోనియాగాంధీ ఆరా తీశారు. ఈ పథకంపై మహిళల నుంచి స్పందన ఎలా ఉందని ఆమె అడిగినట్టు తెలిసింది. అలాగే.. తెలంగాణలో ఎంపీ స్థానాలకు భారీగా అప్లికేషన్స్ వచ్చిన విషయాన్ని కూడా సోనియాకు తెలిపారు రేవంత్ అండ్ టీమ్.
మరోవైపు.. కేంద్ర పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ సమావేశంలో చర్చ కొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలో ఈ విషయంపై దుమారం చెలరేగుతోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్ఎస్ సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ వారంలో కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేరళను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా తలపెట్టాలన్న చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. అయితే.. కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున.. రెండు రాష్ట్రాల సీఎం, మంత్రులు కలిసి నిరసన తెలపడం గురించి ఆ పార్టీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. రేవంత్‌రెడ్డి తనను కలిసినప్పుడు సోనియాగాంధీ ఈ అంశం గురించి చెప్పినట్లు తెలిస్తోంది. సోనియాతో భేటీ తర్వాత వెంటనే తిరుగు ప్రయాణం కావాల్సిన రేవంత్ బృందం ఢిల్లీలోనే ఆగిపోయారు. దాంతో.. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను రేవంత్‌రెడ్డి టీమ్ కలిసే అవకాశం ఉంది.
మొత్తంగా.. సీఎం అయిన తర్వాత సోనియాగాంధీతో తొలిసారి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇక.. ఢిల్లీ పర్యటనకు ముందు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లారు. రాంచీలో జరుగుతున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో రాంచీ నుంచి ఢిల్లీకి చేరుకుని.. నేరుగా సోనియాగాంధీ నివాసానికి వెళ్లారు.