Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-02-01 18:16:30
TWM Live News : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ట్రంప్ తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీతోపాటు పలువురు రిపబ్లికన్ చట్టసభ్యులు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలను సాధారణీకరించేందుకు అబ్రహం ఒప్పందాల్లో అతని పాత్రను ఉటంకిస్తూ ఆయన పేరును నామినేట్ చేశారు. కాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ చేయడం గమనార్హం.
మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలను సులభతరం చేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని క్లాడియా టెన్నీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. దశాబ్ధాలుగా కొనసాగుతోన్న ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని, అటువంటి అసాధ్యాన్ని ట్రంప్ సుసాధ్యం చేసి చూపించాడని గుర్తు చేశారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని వివరించారు.