Category : | Sub Category : నేర Posted on 2024-02-01 18:14:19
TWM Live News : జనవరి 26.. రాత్రి 8గంటల ప్రాంతం.. ఓ వ్యక్తి అత్తగారిని చూసేందుకు భార్యతో కలిసి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి అపస్మారక స్థితిలో కుర్చీలో పడి ఉంది అత్త. తీవ్ర ఆందోళన చెంది హుటాహుటిన.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని హైదరాబాదులో ఉంటున్న బావమరిదికి చెప్పాడు బావ. హుటాహుటిన బయలుదేరి వచ్చి అమ్మను ఆసుపత్రిలో చూసాడు కొడుకు . ఆరోగ్యంగా ఉండే తల్లి ఎందుకలా అయిపోయింది..? వెంటనే ఐడియా వచ్చింది. తన సెల్ఫోన్ కు కనెక్ట్ అయి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించాడు. ఇంతలో అసలు విషయం చూసి అంతా షాక్ కు గురయ్యారు...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి గవరపాలెంలో కర్రి లక్ష్మీ నారాయణమ్మ (67) ఒంటరిగా నివాసముంటున్నారు. ఈనెల 26న రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూతురు చంద్రిక, అల్లుడు మురళీ కృష్ణ కలిసి నారాయణమ్మ ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే నారాయణమ్మ స్పృహ తప్పి కుర్చీలు ఉండడానికి గమనించి అవాక్కయ్యారు. వెంటనే అంబులెన్స్ లో అనకాపల్లిలోని ఆసుపత్రికి హుటాహుటిన నారాయణమ్మను తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విశాఖకు తీసుకెళ్లారు. వెంటనే హైదరాబాదులో ఉంటున్న నారాయణమ్మ కొడుకు కిషోర్ కుమార్ కు సమాచారం అందించారు.
హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరిన కిషోర్.. మరుసటి రోజు 27వ తేదీన విశాఖ చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసాడు. ఆరోగ్యంగా ఉన్న తల్లి.. ఇలా అపస్మారక స్థితికి ఎందుకు వెళ్లిందోనని అనుమానం వచ్చింది. వెంటనే తన సెల్ ఫోన్ కు కనెక్ట్ అయి ఉన్న ఇంట్లోని సీసీ కెమెరా డేటాను తెరిచి చూసాడు కిషోర్. ఆ డేటాలో అవాక్కయ్య వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అదే రోజు రాత్రి 7.26 నిమిషాలకు ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి నారాయణమ్మ మెడకు తువ్వాలని వేగం నుంచి గట్టిగా బిగుస్తున్నట్లు గుర్తించాడు. ఊపిరి ఆడకుండా చేసి… స్పృహ కోల్పోయిన తర్వాత చనిపోయింది అనుకొని.. నారాయణమ్మ మెడలో ఉన్న ఆరున్నర తులాల బంగారం ను ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. తల్లికి మెడ బిగించిన వ్యక్తి.. కేబుల్ నెట్వర్క్ లో పనిచేస్తున్న టెక్నీషియన్ మల్ల గోవింద గా గుర్తించి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు కిషోర్.
వాడే నిందితుడు...
కిషోర్ స్టేట్మెంట్ ప్రకారం అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల్లో నారాయణమ్మ మెడలో బిగిస్తున్న వ్యక్తి మల్ల గోవింద గా నిర్ధారించుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా గాలించారు. జనవరి 30వ తేదీ ఉదయం సంతబయలు జంక్షన్ వద్ద గోవిందను అరెస్టు చేశారు పోలీసులు. ఆరున్నర తులాల బంగారం చైను, ఘటనకు వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు పోలీసులు.
మరోవైపు లక్ష్మీనారాయణమ్మ కోలుకొని డిశ్చార్జి అయింది. తెలిసినవాడే ఇలా బంగారం కోసం.. ప్రాణం తీసేంత పనిచేయడంతో.. ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరాలో జరిగిందంతా రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఈ ఘటనపై పోలీసులు మరింత శ్రమించాల్సి వచ్చేది. కేసును త్వరిత గతిన చేదించిన సిబ్బందికి.. ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తూ.. నేరాల నియంత్రణ, నేరగాళ్ల ఆట పట్టించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.