Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 11:00:35
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ఇక్కడి తెలంగాణభవన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఇందులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, గోడం నగేష్, డీకే అరుణ, బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ బీబీపాటిల్ తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం తక్షణం ఈ భూముల విక్రయాన్ని ఆపేసి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎకరా రూ.80-100 కోట్ల విలువైన భూముల విక్రయాన్ని తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని భారాస అప్పులపాలు చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్న భూములను అమ్మేసి తాము కూడా అదే తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రఘునందన్రావు మాట్లాడుతూ.. హెచ్సీయూకి ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో 400 ఎకరాలు అమ్మేసుకొనే హక్కు రేవంత్రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. గతంలో భారాస అడ్డగోలుగా తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మిందని, ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ నడుస్తోందని డీకే అరుణ ధ్వజమెత్తారు.హెచ్సీయూకి చెందిన 400 ఎకరాలను కాపాడాలని ఏబీవీపీ ప్రతినిధులు బుధవారం ఇక్కడ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్రప్రధానన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విశ్వవిద్యాలయానికి చెందిన భూమిని ఆక్రమించుకుని అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇందులో ఏబీవీపీ జాతీయ కార్యదర్శులు శివాంగి ఖర్వాల్, శ్రవణ్జు తదితరులున్నారు.