Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:06:36
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు(బీజేపీ), కొణిదెల నాగబాబు(జనసేన), బీటీ నాయుడు(టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్(టీడీపీ), ఆలపాటి రాజేంద్రప్రసాద్(టీడీపీ)లతో బుధవారం అమరావతి అసెంబ్లీ భవనంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, బీటీ నాయుడు అసెంబ్లీ గేటు బయట మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హైద్రాబాద్ వంటి మహానగర నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోదీ అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ముందుకు వెళుతోంది. వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ముందుకు వెళుతోది. సూపర్ సిక్స్ అమలు తీరుతో ప్రతిపక్షం భయపడుతుంది అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బులు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. కష్టపడి పని చేస్తే గుర్తింపు ఉంటుంది. అందుకు ఉదాహరణ నేనే. టీడీపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ. గతంలో రాక్షస పాలన సాగింది. 56 కార్పొరేషన్లు పెట్టి బల్లలు, కుర్చీలు, ఇచ్చారు తప్ప నిధులు, విధులు లేవు. గత ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ బడుగులను గౌరవించలేదు. 76 సంవత్సరాల వయస్సులోను సీఎం చంద్రబాబు కష్టపడి పని చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పని చేస్తున్నారు అని అన్నారు.