Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 10:14:40
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఉపాధి హామీ ద్వారా పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణం చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతోపాటు రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారని చెప్పారు. గోకులాల నిర్మాణం, పంట నీటి కుంటల తవ్వకాన్ని ఉపాధి హామీ పథకంలో భాగం చేసిన విధంగానే ఇప్పుడు పాడి రైతుల కోసం మరో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిందని పవన్ కల్యాణ్ అన్నారు.
వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో పశుసంపదకు తాగునీటి సమస్య ఎదురు కారాదన్నారు. నీటి తొట్టెలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని అన్నారు. పశుసంపదకు తాగునీటి కోసం 12,500 నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఉపాధి హామీ నుంచి రూ.56.25 కోట్లు నిధులు వెచ్చిస్తున్నారని చెప్పారు. ఈ నీటి తొట్టెల నిర్మాణం ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఈ వేసవిలోనే ఈ తొట్టెలు సంపూర్ణంగా వినియోగంలోకి రావాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.