Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-02 10:13:23
తెలుగు వెబ్ మీడియా న్యూస్: భూకంప ప్రభావంతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు విలవిల్లాడిపోతున్నాయి. థాయ్‌లాండ్‌తో పోల్చుకుంటే మయన్మార్‌లో భూకంప బీభత్సం అధికంగా ఉంది. భూకంప మృతుల సంఖ్య 2 వేలు దాటిపోయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంప గాయంతో అల్లాడిపోతున్న మయన్మార్‌కు ప్రపంచ దేశాలు సాయం అందిస్తున్నాయి. ఇక మయన్మార్‌లో భారత ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్స్‌లో నిమగ్నమయ్యాయి. మయన్మార్‌కు రకరకాలుగా సాయం చేస్తోంది మన దేశం. ఆహారం, సామగ్రి పంపిణీతో పాటు సహాయక చర్యల్లోనూ పాలు పంచుకుంటోంది. మయన్మార్‌పై భూకంప ప్రభావం ఏడాది పాటు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
భూకంపం శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శిక్షణ పొందిన శునకాలను రప్పించారు. శిథిలాల మీదుగా గోల్డెన్ రిట్రీవర్ శునకాలు నడుస్తూ శోధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని పసిగట్టి రెస్క్యూ సిబ్బందికి సహకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొంటున్న ఆ శునకం పేరు సింబా అధికారులు పేర్కొన్నారు. దాని వాసన పసిగట్టే నైపుణ్యం, చురుకైన కంటి చూపుతో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నది. ఈ గోల్డెన్ రిట్రీవర్ 2022లో యానిమల్ ఆర్మీలోకి ప్రవేశించింది. సింబా మాదిరిగానే, మరికొన్ని కుక్కలకు శిక్షణ ఇచ్చి భూకంప ప్రభావిత ప్రాంతాలలో శిథిలాల కింద ప్రాణాలతో ఊపిరి పీల్చుకుంటున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.